MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భరోసా కు దోహదపడుతుంది : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

  • April 1, 2026
  • 1 min read
ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భరోసా కు దోహదపడుతుంది : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
 
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్ పథకం నేతన్నల ఆర్థిక భరోసా కు ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
 
బుధవారం ఉదయం మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ లతో కలిసి నగరంలోని 29వ డివిజన్ చింతగుంటపాలెంలో పర్యటించి 5 మంది చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి స్వయంగా మగ్గం గుంతలో కూర్చుని మగ్గం నేయడం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ధ్రువీకరణ పత్రాలు అందుకున్న వారిలో పృద్వి వెంకటేశ్వరరావు, ఎర్ర రామలింగేశ్వర రావు, ఆకురాత సులోచన, భూసం లత, ఉమ్మటి మహేశ్వర రావు ఉన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.
చేనేత, మరమగ్గాల రంగాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించిందన్నారు.
 
సుమారు 93 వేల చేనేత కార్మిక కుటుంబాలు, 11,488 మరమగ్గాల యూనిట్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయల మేరకు ఖర్చు భరిస్తోందన్నారు. సగటున ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 780 రూపాయల మేరకు విద్యుత్ శాఖ బిల్లు కలిసి వస్తోందన్నారు. 
మచిలీపట్నం నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలోనీ చింతగుంటపాలెం, గొడుగుపేటలలో 122 చేనేత కుటుంబాలు ఉన్నాయని, చిన్నాపురంలో మరో 160 చేనేత కుటుంబాలు ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛను మంజూరు చేస్తున్నామన్నారు
 
తమ ప్రభుత్వం 2014-19 లో 100 కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి చేనేత సంఘాల ఆర్థిక బలోపేతానికి కృషి చేసిందన్నారు. అంతేకాకుండా చేనేత వస్త్రాల నిల్వలు ఉండడంతో ప్రత్యేక తగ్గింపు ధరలతో ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రంగులు, వర్క్ షెడ్డు వంటి వాటికి ఆర్థిక సహాయం గతంలో అందించేదని, గత ప్రభుత్వ కాలంలో అవన్నీ కనుమరుగయ్యాయని, , వాటిని దశలవారీగా పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం మంత్రి ప్రభుత్వం ఎలా ఉందని ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లు బస్సు ఉచిత బస్సు ప్రయాణం…స్త్రీ శక్తి పథకం, తల్లికి వందనం తదితర పథకాల ఎలా ఉన్నాయని ప్రజలను కోరగా అందరూ బాగున్నాయని చెప్పడం చెప్పుకోదగ్గ విశేషం. ఒక మహిళ తనకు గ్యాస్ డబ్బులు రాలేదని చెప్పడంతో వెంటనే మంత్రి స్పందించి ఆమెకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ వెంటనే వారి బ్యాంకు ఖాతాను అనుసంధానం అయ్యేలా చూడాలని మునిసిపల్ అధికారులకు సూచించారు.
 
ఆర్ టి సి చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ చేనేత వృత్తినే నమ్ముకుని చాలామంది కొనసాగుతున్నారన్నారు. వారి శ్రమను గౌరవించి వారి కుటుంబాలను బలోపేతం చేసి వస్త్ర రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, చేనేత శాఖ అభివృద్ధి అధికారులు రామయ్య, లోకేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు వెంకటస్వామి, సత్యనారాయణ, నారాయణ ఖాజా తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *