MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

బియ్యం నిల్వల వివరాలు ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో తప్పనిసరి: డీఎస్‌ఓ

  • November 20, 2026
  • 1 min read
బియ్యం నిల్వల వివరాలు ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో తప్పనిసరి: డీఎస్‌ఓ

ప్రతి శుక్రవారం అప్‌డేట్ చేయాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మచిలీపట్నం:

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించి, వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారులు, బియ్యం మిల్లర్లు తమ వద్ద ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్ ([https://foodstock.dfpd.gov.in](https://foodstock.dfpd.gov.in)) లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) టి. శివరామ ప్రసాద్ ఆదేశించారు.

ప్రతి శుక్రవారం అప్‌డేట్ తప్పనిసరి

వ్యాపారులు, మిల్లర్లు తమ నిల్వలు, విక్రయాల వివరాలను వాస్తవానికి అనుగుణంగా, అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని డీఎస్‌ఓ స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను పోర్టల్‌లో విధిగా అప్‌డేట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రూ.1,300కే 26 కిలోల బస్తా.. ఇప్పటివరకు 988.26 క్వింటాళ్ల పంపిణీ

వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా 26 కిలోల బస్తా రూ.1,300కే విక్రయిస్తున్నట్లు డీఎస్‌ఓ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,676 మంది వినియోగదారులకు 919.36 క్వింటాళ్ల కేఎన్‌ఎం రకం, 68.90 క్వింటాళ్ల బీపీటీ రకం కలిపి మొత్తం 988.26 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. బియ్యం విక్రయాల్లో పారదర్శకత కోసం జిల్లావ్యాప్తంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

About Author

SSN