MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

మురసు తుపాను హెచ్చరికలు: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • November 2, 2026
  • 1 min read
మురసు తుపాను హెచ్చరికలు: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

‘మురసు’ తుపాను ప్రభావం కృష్ణా జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుపాను తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విజ్ఞప్తి చేశారు. సోమవారం మొవ్వ మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలను వెల్లడించారు.

సోమవారం సాయంత్రం నుంచే ఈదురు గాలుల ప్రభావం మొదలయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం శ్రేయస్కరమని కలెక్టర్ తెలిపారు. తుపాను సమయంలో బయటకు రావడం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి ప్రమాదాలు జరిగే అవకాశముందని, ముఖ్యంగా తెగిపడిన విద్యుత్ తీగలు మరియు నీరు నిలిచిన ప్రాంతాల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తుగా ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, అత్యవసర ఔషధాలను ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

తుపాను సహాయక చర్యల కోసం ప్రతి మండలంలో ఎంపీడీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెట్లు కూలినా, రహదారులకు అడ్డంకులు ఏర్పడినా వెంటనే తొలగించేందుకు వీలుగా ప్రతి మండలంలోనూ జేసీబీలు, పవర్ సా పరికరాలను సిద్ధంగా ఉంచామన్నారు. తుపాను ప్రభావం తగ్గగానే విద్యుత్, రహదారి రవాణా సేవలను త్వరితగతిన పునరుద్ధరిస్తామని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

About Author

SSN