MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను అడ్డుకోవాలి: మచిలీపట్నంలో ఎల్ఐసీ ఉద్యోగుల ధర్నా

  • November 2, 2026
  • 1 min read
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను అడ్డుకోవాలి: మచిలీపట్నంలో ఎల్ఐసీ ఉద్యోగుల ధర్నా

మచిలీపట్నం:

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ నవంబర్ 2, 3 తేదీలలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం పూర్తి సంఘీభావం తెలిపింది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) పిలుపు మేరకు సోమవారం మచిలీపట్నంలోని స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ICEU మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం మరియు ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించారు. లాభాల్లో నడుస్తున్న బ్యాంకింగ్ సంస్థను ప్రైవేటీకరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, విదేశీ ఆర్థిక సంస్థల ఆధిపత్యం పెరిగితే దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2003లో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం ఐడీబీఐలో ప్రభుత్వ వాటాను కనీసం 51 శాతంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. నిధుల సమీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.

ఈ సంఘీభావ నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు డి. వాసు, వై. స్వామినాధ్, ఏ. మల్లికార్జున ప్రసాద్, ఎస్.వి. రత్నరావు, సాయి తదితర ఎల్ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author

SSN