కృష్ణా జిల్లాలో ముమ్మరంగా తుఫాను సహాయక చర్యలు: 177 కేంద్రాల్లో 15 వేల మందికి ఆశ్రయం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి, సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
177 పునరావాస కేంద్రాల ఏర్పాటు
తుఫాను ప్రభావం దృష్ట్యా కృష్ణా జిల్లావ్యాప్తంగా మొత్తం 177 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో ఇప్పటివరకు 15,101 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన భోజనం, మంచినీరు, వైద్య సదుపాయాలు తదితర సౌకర్యాలు నిరంతరం అందేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ప్రజల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు.
65 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా
తుఫాను ధాటికి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సమాచారం ప్రకారం 65 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయి అధికారులు పరిశీలిస్తున్నారని, అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వివరించారు.
పంటలు, విద్యుత్ స్తంభాల నష్టంపై వివరాల సేకరణ
ఇతర ఆస్తి, పంట నష్టాలపై కలెక్టర్ స్పందిస్తూ… వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టం, నేలకొరిగిన చెట్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ పునరుద్ధరణ పనులపై శాఖలవారీగా వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికను సిద్ధం చేసి నష్టపరిహార వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు.

