MachilipatnamLocal News
November 22, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్

  • October 27, 2026
  • 0 min read
ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్

మచిలీపట్నం:

నవంబర్ 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృష్ణా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. బందరు డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్/డీఏఆర్ ప్రత్యేక పోలీసు బృందాలు కలిసి మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

పోలీసు బృందాలు టెంపుల్ కాలనీ, బలరామునిపేట, రుస్తుంబాద, బుట్టాయిపేట, ముస్తాఖాన్‌పేట, ఉల్లింగిపాలెం, ఓగీసుపేట, ఇనగుదురుపేట, చింతచెట్టు సెంటర్ తదితర సున్నిత ప్రాంతాల్లో కవాతు నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు లేదా ఇతరుల ఒత్తిళ్లకు గురికాకుండా రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్లు కె. యేసుబాబు, ఎస్కే. అబ్దుల్ నబీ, ఎస్. పరమేశ్వర్, కె. నాగేంద్ర ప్రసాద్, వి. వెంకటేశ్వరరావు, కె.వి.ఎస్.వి. ప్రసాద్, ఎన్. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN