పొదుపు అలవాటుతోనే పేదరికం నుంచి విముక్తి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం :
చిరు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటును పెంపొందించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి డీఆర్డీఏ, తపాలా, విద్యాశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పొదుపు ప్రాముఖ్యత, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై సమీక్షించారు.
తపాలా శాఖ ద్వారా ‘మైక్రో సేవింగ్స్
గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ, అత్యవసర సమయంలో ప్రజలు అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని కలెక్టర్ తెలిపారు. పాత పిగ్మీ పొదుపు విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తపాలా శాఖ ద్వారా ‘మైక్రో సేవింగ్స్’ విధానాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా అమలు చేయాలన్నారు. రోజుకు రూ.50, రూ.100 లేదా వారి శక్తిమేరకు చిన్న మొత్తాలను పొదుపు చేసేలా ప్రోత్సహించాలని, తపాలా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బయోమెట్రిక్ పరికరాల ద్వారా జమ చేసుకునే సౌకర్యాన్ని ప్రజలకు వివరించి ఖాతాలు తెరిపించాలని సూచించారు.
విద్యార్థుల్లో ఆర్థిక క్రమశిక్షణ
పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పొదుపు అలవాటును పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో గుర్తించిన 19 వేల మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 1,200 మందికి మాత్రమే ఖాతాలు తెరిచారని, మిగిలిన అర్హులైన విద్యార్థులందరికీ త్వరతిగతిన పొదుపు ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
రోజువారీ పర్యవేక్షణ, గూగుల్ షీట్లో నమోదు
ఏపీఎంలు, పోస్టుమాస్టర్లు సమన్వయంతో పనిచేసి మండల, గ్రామ స్థాయిలో వ్యాపారులు, రైతులు, మహిళలచే ఖాతాలు తెరిపించాలని ఆదేశించారు. మండలాల వారీగా తెరిచిన ఖాతాలు, జమ చేసిన వివరాలను గూగుల్ స్ప్రెడ్షీట్లో రోజువారీగా నమోదు చేసి నివేదికలు అందించాలని, ఈ ప్రక్రియ గాడిలో పడే వరకు నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరినాథ్, తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఈవో యు.వి. సుబ్బారావు, ఎంఈఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

