నందివాడ సొసైటీలో ₹2 కోట్ల అవినీతిపై నివేదిక కోరిన లోకాయుక్త
గుడ్లవల్లేరు / ఉయ్యూరు:
కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం, నందివాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో చోటుచేసుకున్న రూ. 2 కోట్ల నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర లోకాయుక్త తల్లాప్రగడ మల్లిఖార్జున రావు తీవ్రంగా స్పందించారు. ఈ అవినీతిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ మరియు కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు (కేసు నెం. 1992/2026/బి1).
వివరాల్లోకి వెళ్తే నందివాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులు సుమారు రూ. 1.90 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించినప్పటికీ, సొసైటీ కార్యదర్శి శ్రీహరిప్రసాద్ ఆ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేయకుండా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ 2026 జూలై 1న రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి. రాజశేఖర్‌తో పాటు రాష్ట్ర లోకాయుక్తకు కూడా అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త, ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 18 లోపు నివేదిక సమర్పించాలని సహకార శాఖ కమీషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

