మచిలీపట్నం రూరల్ మండలంలో రూ.164 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం మచిలీపట్నం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ.330 కోట్లతో నియోజకవర్గ రూపురేఖలు మార్పు
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో మంత్రి మాట్లాడుతూ, మచిలీపట్నం నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా మొత్తం రూ.330 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని వెల్లడించారు. రూరల్ మండల పరిధిలో ఉపాధి హామీ (MGNREGS), VB-G RAM G, SASCI పథకాల కింద రూ.164 కోట్లతో 604 పనులను చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ఆర్అండ్బీ ద్వారా రూ.54 కోట్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.90 కోట్ల అంచనాతో మంచినీటి ప్రాజెక్టులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు.
రూ.8,000 కోట్లతో గోవా షిప్యార్డ్ – 10 వేల ఉద్యోగాలు
మచిలీపట్నం ప్రాంతానికి భారీ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, గోవా షిప్యార్డ్ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి తెలిపారు. దీనిద్వారా దాదాపు 10,000 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, వారికి పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్’ ద్వారా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మార్చి నాటికి మచిలీపట్నం పోర్టు ప్రారంభం
రాబోయే మార్చి నాటికి మచిలీపట్నం పోర్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. తీర ప్రాంతంలో 750 ఎకరాలు కేటాయించామని, గోల్ఫ్ కోర్స్, ఫిల్మ్ స్టూడియో నిర్మాణాలకు ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. బీచ్ టూరిజాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, ఉపాధి పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రూరల్ పరిధిలో మంజూరైన ప్రధాన అభివృద్ధి పనులు
గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యార్థం పెద్దపట్నం వెళ్లే దారిలో రూ.20 కోట్లతో బ్రిడ్జి, పోలాటితిప్ప–గరాలదిబ్బ మధ్య రూ.15 కోట్ల వ్యయంతో గుండేరు, నడిమేరు వంతెనల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా నెలకుర్రు–మాజేరు, నెలకుర్రు–పెదయాదర తారు రోడ్డు నిర్మాణానికి రూ.2.25 కోట్లు, వాడపాలెం పరిధిలో BT రోడ్డు పనులకు రూ.1.30 కోట్లు, గ్రావెల్ రోడ్డుకు రూ.29 లక్షలు కేటాయించారు. వీటితో పాటు చిన్నాపురం–జీలిగలగండి రోడ్డుకు రూ.1.16 కోట్లు, ఆర్.గొల్లపాలెం–రుద్రవరం రోడ్డుకు రూ.60 లక్షలు, భోగిరెడ్డిపల్లి–పిల్లనసాగర్ దారికి రూ.48 లక్షలతో పాటు రుద్రవరం పంచాయతీ సచివాలయ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేశారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

