MachilipatnamLocal News
September 23, 2026
జిల్లా

గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం: ఎంపీ బాలశౌరి హర్షం

  • September 23, 2026
  • 1 min read
గోవా షిప్‌యార్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం: ఎంపీ బాలశౌరి హర్షం

మచిలీపట్నం:

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ‘గోవా షిప్‌యార్డు లిమిటెడ్’ ఆధ్వర్యంలో భారీ రక్షణ, నౌకా నిర్మాణ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర కేబినెట్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రూ.8,000 కోట్ల పెట్టుబడి – 8,000 మందికి ఉపాధి

మచిలీపట్నం పోర్టు కేంద్రంగా సుమారు రూ. 8,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుందని ఎంపీ తెలిపారు. దీని ద్వారా ప్రాంతీయంగా 3,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా మొత్తంగా 8,000 మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

రక్షణ రంగంలో మచిలీపట్నం సరికొత్త అధ్యాయం

గోవా షిప్‌యార్డు విస్తరణతో మచిలీపట్నం రక్షణ, నౌకా నిర్మాణ రంగంలో దేశంలోనే కీలక కేంద్రంగా అవతరించబోతోందని బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. భారత నౌకాదళం (Indian Navy), కోస్ట్‌గార్డ్‌ (Coast Guard) అవసరాలకు తగినట్లుగా నౌకల నిర్మాణం, మరమ్మతుల కార్యకలాపాలకు ఈ హబ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాకతో మచిలీపట్నం నియోజకవర్గ ముఖచిత్రం మారడమే కాకుండా, ఆర్థికంగా, పారిశ్రామికంగా శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.

About Author

SSN