భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లా కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* అత్యవసర సహాయం కోసం 08672-252399 నంబర్‌ను సంప్రదించాలి: జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ
* బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్)
మచిలీపట్నం:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్)గా బలపడి, తీరం దాటే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఈ నెల 25 వరకు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ముందస్తు చర్యగా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ డి.కె. బాలాజీ తెలిపారు.
తీరం వైపు వేగంగా డీప్ డిప్రెషన్
వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం మరింత బలపడి, సెప్టెంబరు 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం-గోపాలపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూమ్
వర్షాలు, వరద ముంపు, నీటి నిల్వలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సాయం కోసం, సమాచారం అందించడం కోసం కలెక్టరేట్లోని 08672-252399 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేసేలా అధికారులు, సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించారు.
కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి సమస్యను నమోదు చేసి, వెంటనే సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి తక్షణ సహాయ చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

