కృష్ణా విశ్వవిద్యాలయంలో “విలువల విద్య”పై ప్రత్యేక అవగాహన సదస్సు
మచిలీపట్నం:
విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవీయ కోణాన్ని పెంపొందించే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం మరియు బెంగళూరుకు చెందిన ‘శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ సంయుక్త ఆధ్వర్యంలో “విలువల విద్య” (Values Education) అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి (VC) ప్రొఫెసర్ కె. రాంజీ మాట్లాడుతూ… విద్యాబోధనలో నైతిక విలువలు, మానవీయ విలువల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. AICTE నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో ‘యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్’ను తప్పనిసరి కోర్సుగా ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రాచీన కాలంలో నలంద, విక్రమశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు, స్వదేశీ గురుకులాల ద్వారా భారతదేశం ప్రపంచానికి విలువలతో కూడిన విద్యను, ‘గురు-శిష్య’ బంధ ప్రాముఖ్యతను పరిచయం చేసిందని గుర్తుచేశారు.
విద్యార్థుల్లో మానవీయ విలువలను మరింతగా పెంపొందించేందుకు బెంగళూరు శ్రీ సత్యసాయి సంస్థతో ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు వీసీ ప్రకటించారు.
ఈ సదస్సులో శ్రీ సత్యసాయి సంస్థ ప్రతినిధులు కార్తీక్ వి.కె., సత్యజిత్ వక్తలుగా పాల్గొని విద్యార్థులకు, అధ్యాపకులకు విలువల విద్యపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. కోటేశ్వరరావుతో పాటు పలువురు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

