ఇంజనీర్లు వినూత్న ఆలోచనలతో మెరుగైన ఫలితాలు సాధించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ స్థానిక సమస్యలకు తక్కువ ఖర్చుతో, వేగంగా, అత్యుత్తమ పరిష్కారాలను అన్వేషించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక భారతదేశ నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమైందని కొనియాడారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరమని, అందువల్ల ప్రతి ఏటా జిల్లాలో ఇంజనీర్స్ డేను ఒక సంప్రదాయంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అసిస్టెంట్ ఇంజనీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో ‘భారతరత్న’ స్థాయికి ఎదిగిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం ప్రతి ఇంజనీర్‌కూ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. పరిమిత వనరులతో అసాధారణ పరిష్కారాలను కనుగొనడమే ఇంజనీరింగ్ నైపుణ్యానికి అసలైన నిదర్శనమని తెలిపారు. కేవలం సాధారణ ప్రభుత్వ విధానాలకే పరిమితం కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వినూత్న మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల పనుల్లో తక్కువ వ్యయంతో వేగవంతమైన, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రయోగాలు చేయాలని సూచించారు. ప్రతి పనినీ ఇంకా సమర్థవంతంగా, త్వరగా, తక్కువ ఖర్చుతో ఎలా చేయగలమనే ఆలోచనా విధానంతో ముందడుగు వేయాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం జిల్లాలోని ఇంజనీర్లు, ఇంజనీరింగ్ సిబ్బందికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ హరిబాబు, హౌసింగ్ పీడీ వెంకట్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, పలువురు డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.

