MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

మంగినపూడి సాగర తీరంలో ప్రారంభమైన మహాగణపతి ఉత్సవాలు

  • September 14, 2026
  • 0 min read
మంగినపూడి సాగర తీరంలో ప్రారంభమైన మహాగణపతి ఉత్సవాలు

మచిలీపట్నం:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ సాగర తీరంలో 63 అడుగుల మట్టి విజయగణపతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన సతీమణి నీలిమతో కలిసి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితర ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజే జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మంగినపూడి తీరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సాయంత్రం వేళ కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

మొత్తం 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల కోసం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు మరియు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

About Author

SSN