MachilipatnamLocal News
September 20, 2026
పోలీస్ & లీగల్ డైరీ

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి: కీచక తాతకు జీవిత ఖైదు, ₹10 లక్షల పరిహారం

  • September 8, 2026
  • 1 min read

మచిలీపట్నం / మండవల్లి:

మూడేళ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడిన కీచకుడికి మచిలీపట్నం ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ పర్యవేక్షణలో కోర్టు మోనిటరింగ్ సెల్ (CMC), ప్రాసిక్యూషన్ విభాగం సేకరించిన పక్కా ఆధారాలతో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది.

కేసు వివరాలు:

మండవల్లి మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఒక రొయ్యల చెరువు వద్ద కాపలా ఉండే కుటుంబంలో 2019 నవంబర్ 12న ఈ ఘోరం జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు సంతకు వెళ్తూ, నిద్రిస్తున్న తమ 3 సంవత్సరాల 11 నెలల రెండో కుమార్తెను ఇంట్లోనే ఉన్న తాత (తల్లికి తండ్రి) కాగిత గంగా ప్రసాద్ (63) రక్షణలో ఉంచి వెళ్లారు. అదే అదనుగా భావించిన గంగా ప్రసాద్, చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు ఏడవడంతో దాడి చేసి బయట పడేశాడు.

సంత నుండి తిరిగి వచ్చిన తల్లి, పాప పరిస్థితిని మరియు రక్త గాయాలను గమనించి ప్రశ్నించగా బాలిక జరిగిన దారుణాన్ని తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మండవల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు (Cr.No. 230/2019 U/s 376-AB IPC & Sec 5(m)(n) r/w 6 POCSO Act) చేశారు.

తీర్పు వివరాలు:

అప్పటి గుడివాడ ఎస్డీపీఓ ఎన్. సత్యానందం దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, మచిలీపట్నం స్పెషల్ పోక్సో సెషన్స్ జడ్జి శ్రీ గాజుల వెంకటేశ్వర్లు కేసు విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ మదివాడ నరసింహారావు 12 మంది సాక్షులను విచారించి, బలమైన వాదనలు వినిపించారు. నేరం సంపూర్ణంగా రుజువు కావడంతో నిందితుడు కాగిత గంగా ప్రసాద్‌కు

శిక్ష: పోక్సో చట్టం సెక్షన్ 5(m) r/w 6 కింద జీవిత ఖైదు మరియు ₹1,000 అపరాధ రుసుము (చెల్లించని పక్షంలో మరో నెల రోజులు సాధారణ జైలు శిక్ష).
పరిహారం: బాధిత బాలికకు ₹10,00,000 (పది లక్షల రూపాయలు) పరిహారంగా అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

పోలీస్ యంత్రాంగానికి అభినందనలు:

బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చేలా వ్యవహరించి, ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన ఏలూరు ఎస్డీపీఓ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ సీఐ రవికుమార్, సీఎంసీ ఇన్ స్పెక్టర్ ఎం. సుబ్బారావు, మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు, నాటి ఇన్వెస్టిగేషన్ అధికారులను మరియు ప్రాసిక్యూషన్ టీమ్‌ను ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ ప్రత్యేకంగా అభినందించారు.

About Author

SSN