మచిలీపట్నం సాహితీ మణిహారం… డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి మచిలీపట్నం సాహితీ మిత్రుల సభ్యురాలు కావడం మచిలీపట్నానికే గర్వకారణమని సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతిని సాహితీ మిత్రుల సంస్థ తరఫున ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి సాహితీ మిత్రుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రావి రంగారావు “పద్య కవితలు ఒక పరిశీలన” అనే అంశంపై ఎం.ఫిల్, రావూరి భరద్వాజ “పాకుడు రాళ్లు ఒక పరిశీలన” అనే అంశంపై పి.హెచ్.డి సాధించిన ఉత్తమ తెలుగు ఉపాధ్యాయిని అని కొనియాడారు. ఆమె ఇప్పటికే నాలుగు పుస్తకాలు రచించి సాహితీ సేవలో తనదైన ముద్ర వేశారన్నారు. సర్వశిక్షా అభియాన్ వారి ‘కృష్ణా తరంగాలు’ పిల్లల మాసపత్రిక సంపాదక వర్గంలో పనిచేయడంతో పాటు, మచిలీపట్నం సాహితీ మిత్రుల పక్షాన ‘కొత్త పూలు’, ‘పద్య పుష్పకం’, ‘తేనె చినుకులు’ వంటి కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించి సాహిత్య రంగానికి విశేష సేవలందించారని తెలిపారు.
ఆమెకు 2019, 2022 సంవత్సరాలలో కృష్ణాజిల్లా విద్యాశాఖచే ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారాలు లభించాయని గుర్తుచేశారు. కవన కిరణాలు సాహిత్య సంస్థ ద్వారా ‘కవిరత్న’, వాగ్దేవి కళా పీఠం ద్వారా ‘కవికోకిల’ బిరుదులు, 2023లో ‘మహిళా రత్న’, 2024లో ‘గిడుగు పురస్కారం’, గుంటూరు సాహితీ మిత్రులు సంస్థ ద్వారా ‘జీవన సాఫల్య పురస్కారాలు’ పొందారని వివరించారు. నేడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఉమా సరస్వతి, రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా పురస్కారాలు అందుకోవాలని బాలాజీ, సంస్థ కార్యదర్శి మేడిశెట్టి యోగేశ్వరరావు ఆకాంక్షించారు.
సాహిత్య రంగంలో తనను ఉన్నతంగా తీసుకెళ్లడానికి ఎంతో సహకరించిన మచిలీపట్నం సాహితీ మిత్రుల సంస్థ సభ్యుల సహకారం మరువలేనిదని డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

