MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఓటరు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ!

  • November 18, 2026
  • 1 min read
ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఓటరు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ!

గుంటూరు:

ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి అర్హులైన ఉపాధ్యాయులకు మరో సువర్ణ అవకాశం లభించింది. డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు ఓటరు నమోదుకు గడువు ఇస్తున్నట్లు గుంటూరు – కృష్ణా ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఈఆర్ఓ మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నామని, ఇప్పటివరకు 15 వేల దరఖాస్తులు అందగా మొత్తం 19 వేల మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు అంచనా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఓటరు నమోదు అర్హతల వివరాలను తెలియజేస్తూ, పూర్వ గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానికంగా నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా పరిగణింపబడతారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, 2026 నవంబరు 1వ తేదీకి ముందు ఆరు సంవత్సరాల నుండి వృత్తిలో కొనసాగుతూ ఉండాలని, అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల లేదా ఆపై స్థాయిలో బోధన అనుభవం ఉండాలని వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉంటారని, అయితే వారి సర్వీసును జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి లేదా కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు.

అర్హులైన ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, లేదా ఫారం 19 పూర్తి చేసి ఏఈఆర్వోలుగా ఉన్న స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె.కె. గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా. టి. సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సీపీఐ(ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైయస్సార్‌సీపీ ప్రతినిధి వై. పిచ్చి రెడ్డి, జనసేన పార్టీ ప్రతినిధి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN