MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

స్వచ్ఛత ప్రజల జీవన విధానంగా మారాలి: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • October 2, 2026
  • 1 min read
స్వచ్ఛత ప్రజల జీవన విధానంగా మారాలి: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా పరిగణించకుండా, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన విధానంగా మార్చుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘కృష్ణా జిల్లా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026’ (రెండో విడత) జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎంపికైన విజేతలకు అవార్డులను అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జీవితం సమాజ సేవకు, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. బారిస్టర్ చదివి ఉండి కూడా స్వలాభాన్ని విడిచిపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. దక్షిణాఫ్రికాలో తనకు జరిగిన అవమానాన్ని సమాజానికి జరిగిన అన్యాయంగా భావించి పోరాటానికి నాంది పలికారని, చివరకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కూడా పదవులను ఆశించకుండా శాంతి స్థాపనకే కృషి చేశారని పేర్కొన్నారు.

గాంధీజీ చూపిన సామాజిక బాధ్యత, పరిశుభ్రత పట్ల నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశుద్ధ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా ఇతరులలో కూడా స్ఫూర్తి నింపవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ దయాకర్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు మరియు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

About Author

SSN