MachilipatnamLocal News
October 17, 2026
స్పెషల్ స్టోరీ

మెడికో లీగల్ కేస్ (MLC) అంటే ఏమిటి? ఎప్పుడు నమోదు చేస్తారు? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

  • October 2, 2026
  • 1 min read
మెడికో లీగల్ కేస్ (MLC) అంటే ఏమిటి? ఎప్పుడు నమోదు చేస్తారు? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

వైద్య వృత్తి సమాజంలో ఎంతో గౌరవప్రదమైనది. అత్యధిక శాతం మంది వైద్యులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే, కొందరు వ్యక్తులు చేసే అక్రమాలు మరియు చట్టవ్యతిరేక డిమాండ్లు మొత్తం వైద్య వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే యాక్సిడెంట్ కేసులో కాలుకి ఆపరేషన్ అవసరమై నగరంలోని ఒక ప్రముఖ ఎముకల వైద్యశాలలో బాధితుడు చికిత్స తీసుకుంటున్నాడు. దానికి సంబంధించి మెడికో లీగల్ కేసు నమోదు చేయడానికి సంబంధిత రోగి బంధువులు డాక్టర్ని సంప్రదించగా, సదరు డాక్టర్ వేల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగి బంధువులు సదరు మొత్తాన్ని, ఆ వైద్యునికి సమర్పించుకుని మెడికో లీగల్ కేసు కు సిఫార్సు చేయించుకున్నట్లుగా సమాచారం. 

అసలు మెడికో లీగల్ కేస్ అంటే ఏమిటి దానికి వైద్యులు డబ్బులు డిమాండ్ చేయవచ్చా? ఒకసారి వివరంగా తెలుసుకుందాం!

ఒక వ్యక్తి గాయపడినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ సంఘటన వెనుక ఏదైనా నేరం లేదా చట్టపరమైన బాధ్యత ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తే, దానిని “మెడికో లీగల్ కేస్” (MLC) గా రికార్డు చేస్తారు. వైద్యపరమైన చికిత్సతో పాటు చట్టపరమైన విచారణ కూడా అవసరమైన కేసుల్లో డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు.

ఎలాంటి సందర్భాల్లో MLC నమోదు చేస్తారు?

సాధారణ అనారోగ్య సమస్యలకు MLC వర్తించదు. కేవలం క్రింది పరిస్థితుల్లోనే దీనిని నమోదు చేస్తారు.

రోడ్డు ప్రమాదాలు: వాహనాల డి కొట్టుకోవడం వల్ల తీవ్రంగా గాయపడటం.

దాడి మరియు గొడవలు: ఇతరుల దాడిలో గాయపడటం, కత్తిపోట్లు, తుపాకీ గాయాలు.

విషప్రయోగాలు / పొరపాటున విషం తాగాడం: యాసిడ్, పురుగుల మందులు లేదా ఇతర ప్రమాదకర రసాయనాలు తాగడం.

కాలిన గాయాలు: అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షాక్ లేదా రసాయనాల వల్ల శరీరం కాలడం.

ఆత్మహత్యాయత్నాలు & అనుమానాస్పద మరణాలు: ఉరి వేసుకోవడం, ఎత్తైన ప్రాంతాల నుండి దూకడం లేదా అనుమానాస్పదంగా అపస్మారక స్థితికి చేరుకోవడం.

లైంగిక దాడులు: లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు గురైన బాధితుల కేసుల్లో.

పని ప్రదేశాల్లో ప్రమాదాలు: పరిశ్రమలు, ఫ్యాక్టరీలు లేదా నిర్మాణ ప్రాంతాల్లో జరిగే తీవ్ర ప్రమాదాలు.

ఈ విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు:

చట్టం మరియు నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఎమ్మెల్సీ నమోదు ఉచితం: యాక్సిడెంట్లు, దాడి లేదా అనుమానాస్పద గాయాల కేసుల్లో ఎమ్మెల్సీ కేటాయించి పోలీసులకు సమాచారం ఇవ్వడం డాక్టర్ బాధ్యత. దీనికి అదనంగా ఎలాంటి రుసుము డిమాండ్ చేయకూడదు. చట్టబద్ధంగా ఏ వైద్యుడు కూడా ఎమ్మెల్సీ నమోదు చేయడానికి లేదా ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించకూడదు. రోగికి జరిగిన గాయం లేదా సంఘటన క్రిమినల్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్సీ నమోదు చేయడం వైద్యుడి చట్టపరమైన మరియు వృత్తిపరమైన బాధ్యత.

సుప్రీం కోర్టు ఆదేశాలు ఏం చెబుతున్నాయి?

పండిత్ పరమానంద్ కతారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1989):

సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం — రోగి ప్రాణాలను కాపాడటం మరియు ఎమ్మెల్సీ నమోదు చేయడం ఏ వైద్యుడికైనా మొదటి విధి. “పోలీస్ కేస్ అవుతుందేమో”, “కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో” లేదా “డబ్బులు కట్టలేదు” అనే సాకులతో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చికిత్సను లేదా ఎమ్మెల్సీ నమోదును నిరాకరించడానికి వీల్లేదు.

భారతీయ న్యాయ సంహిత (BNS) & మెడికల్ ఎథిక్స్:

అత్యవసర స్థితిలో ఉన్న రోగికి ఎమ్మెల్సీ వైద్యం నిరాకరించడం లేదా కేసు నమోదు చేయకపోవడం వైద్య నిర్లక్ష్యం కిందకు వస్తుంది. నేరం జరిగిందని తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే లేదా ఎమ్మెల్సీ నమోదు చేయకపోతే సంబంధిత వైద్యుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రైవేటు ఆసుపత్రి పై వెంటనే ఫిర్యాదు చేయడానికి మార్గాలు

స్పందన గ్రీవెన్స్ (1902): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 1902 కు ఫోన్ చేసి కలెక్టర్ లేదా హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చేలా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

డిఎంహెచ్ఓ (DM&HO) కు ఫిర్యాదు: ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, మరియు నిబంధనల అమలుకు జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ అత్యున్నత అధికారి. లంచం డిమాండ్ చేయడం, ఎమ్మెల్సీ కేసుల తిరస్కరణ, లేదా అక్రమాలకు పాల్పడటంపై నేరుగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వక ఆధారాలు (బిల్లులు, ఆడియో/వీడియో లేదా స్టేట్‌మెంట్) జతచేసి జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు అందజేయవచ్చు.

పోలీస్ స్టేషన్ (MLC విస్మరిస్తే): బాధితుడికి అత్యవసర ఎమ్మెల్సీ వైద్యం నిరాకరిస్తే లేదా లంచం అడిగితే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా 112 / 100 కు ఫోన్ చేసి సహాయం కోరవచ్చు.

శ్యామ్ కాగిత,

మచిలీపట్నం 

About Author

SSN