అక్వాన్ తుఫాను ఎఫెక్ట్: మచిలీపట్నంలో డ్రైనేజీల పూడికతీత పనులు ముమ్మరం
విజయవాడ నుంచి ప్రత్యేకంగా ‘సూపర్ సక్కర్’ యంత్రాన్ని తెప్పించిన కలెక్టర్ డీకే బాలాజీ
క్షేత్రస్థాయిలో పనులను స్వయంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం:
అక్వాన్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. నగరంలోని ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ సజావుగా పనిచేసేలా, వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసేందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
కలెక్టర్ అభ్యర్థన మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సహకారంతో ప్రత్యేకంగా ‘సూపర్ సక్కర్’ యంత్రాన్ని మచిలీపట్నానికి తెప్పించారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు నగరంలోని ప్రధాన డ్రైనేజీలు, కల్వర్టుల వద్ద పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాలను ఈ యంత్రం ద్వారా పూర్తిస్థాయిలో తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ముఖ్యంగా వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన
నగరంలో జరుగుతున్న పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురిసినా వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో నీరు నిలిచే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీలను పూర్తిగా శుభ్రపరుస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ అధికారి ప్రవీణ్ కలెక్టర్కు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు.

