రైతులకు ఎరువులు పంపిణీ పై జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం:
జిల్లాలోని రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయుటకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం న్యూ ఢిల్లీ నుండి కేంద్ర డిజిటల్ వ్యవసాయం అదనపు కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ రైతులకు ఎరువుల పంపిణీ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నగరంలోని వారి చాంబర్ నుండి పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని రైతు సేవ కేంద్రాల వద్ద గాని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వద్ద గాని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక బద్ధంగా యూరియా పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకుల స్థాయిలో ధ్రువీకరణ వచ్చే విధంగా వ్యవసాయ కమిషనర్ కు లేఖ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని రైతులకు అవసరమైనంత యూరియాను దశలవారీగా పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
కృష్ణా జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ వచ్చిన వెంటనే యూరియా పంపిణీ సజావుగా జరుగుతుందా లేదా ముందుగానే పరీక్షించాలన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు ముందుగానే వారికి కావలసిన యూరియా గురించి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. యూరియా బుకింగ్ విధానం పై రైతులకు సరైన అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. అవసరమైన పక్షంలో యూరియా పంపిణీకి ప్రత్యేకంగా ఒక కార్డును కూడా సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, వ్యవసాయ శాఖ డిడి నాగభూషణరావు, ఏవో శాంత పాల్గొన్నారు.

