దసరా పండుగకు 42 ప్రత్యేక బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా జిల్లా ప్రజారవాణా అధికారి
మచిలీపట్నం:
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా జిల్లా ప్రజారవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం మరియు ఉయ్యూరు డిపోల నుండి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, కృష్ణా జిల్లాల్లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 16-10-2026 నుండి 19-10-2026 వరకు 42 ప్రత్యేక బస్సులను విజయవాడ మీదుగా నడపనున్నట్లు కృష్ణా జిల్లా ప్రజారవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసుల సంఖ్యను పెంచేందుకు డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పండుగ ముగిసిన అనంతరం కూడా తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ మీదుగా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
సాధారణ ఛార్జీలే వసూలు:
ఈ దసరా స్పెషల్ సర్వీసులలో ప్రయాణించే వారి నుండి సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని, అదనపు ఛార్జీలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ముందస్తుగా టిక్కెట్లను ఆన్లైన్లో “అడ్వాన్స్ రిజర్వేషన్” చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాలకు అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మరింత సమాచారం కొరకు సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించవచ్చని సూచించారు.

