MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న ‘శాంతి కళా పురస్కారం’

  • October 4, 2026
  • 1 min read
ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న ‘శాంతి కళా పురస్కారం’

మచిలీపట్నం :

ప్రముఖ యాంకర్, రంగాస్థల నటి పిల్లారిశెట్టి శాంతి పేరిట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న కళా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఒకరికి ‘శాంతి కళా పురస్కారం’ అందజేయాలని భావతరంగిణి సాంస్కృతిక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు భవిష్య ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక వివేకానంద మందిరంలో భావతరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నటి శాంతి సంతాప సభను ఘనంగా నిర్వహించారు.

సంతాప సభలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ శాంతి సాంస్కృతిక రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చనిపోయే వరకు నాటకాల్లో నటించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని, సెప్టెంబర్‌లో మరణించిన ఆమె, ఆగస్టు నెలలో కూడా ఎంతో ఉత్సాహంగా నాటకంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఇటీవల ‘అభినయ’ నాటకంలో 80 ఏళ్ల వృద్ధురాలిగా, 50 ఏళ్ల తల్లిగా, 25 ఏళ్ల యువతిగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన తీరును పలువురు స్మరించుకున్నారు. అలాగే తన మరణానంతరం భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు దానం చేయాలని నిర్ణయించడం ఆమె నిలువెత్తు మానవత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో శాంతి భర్త దిలీప్‌తో పాటు గుత్తికొండ సుబ్బారావు, లంకిశెట్టి బాలాజీ, టీ పెద్దిరాజు, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, మేడిశెట్టి యోగేశ్వరరావు, దత్తాత్రేయ శర్మ, రావినూతల సత్యనారాయణ, అద్దేపల్లి ప్రసాద్, ఈశ్వరరావు మాస్టారు, వై శ్రీరామ్, కే ఉమా, సింగరాజు కళ్యాణి, విజయలక్ష్మి, గుడిపూడి రాధికా రాణి, ప్రభాకర్ తదితరులు ప్రసంగించి, ఆమెకు నివాళులర్పించారు.

About Author

SSN