MachilipatnamLocal News
April 3, 2026
జిల్లా

పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకుని రావాలన్నదే పి….4 ముఖ్య ఉద్దేశం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • March 31, 2026
  • 0 min read
[addtoany]
పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకుని రావాలన్నదే పి….4 ముఖ్య ఉద్దేశం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
 
పి…4 కార్యక్రమం ఒక బ్రహ్మాస్త్రమని, స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా సమాజంలోని పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకుని రావాలన్నదే పి….4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
 
సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పి…4( పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ) మొదటి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నానిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి…4 ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, జిల్లాలో 78,000 మంది బంగారు కుటుంబాలను, 2903 మంది మార్గదర్శిలను గుర్తించామని వారు 44,270 మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు. చాలామంది మార్గదర్శిలు దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదొక పరిణామ క్రమం అని ఇంకా అంతం కాలేదన్నారు. ఇంకా చాలా మెరుగుపరచవలసిన అవకాశాలు ఉన్నాయన్నారు. మార్గదర్శిలు బంగారు కుటుంబాలను లోతుగా అధ్యయనం చేసి వారికి కావలసిన సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న సహాయం పేదల జీవితాల్లో ఎంతో గొప్ప మార్పు తెస్తుందన్నారు. 
కేవలం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బంగారు కుటుంబాలకు వారి అభ్యున్నతి కోసం సరైన సమయంలో సరైన మార్గ నిర్దేశం చేయడం కూడా ఒకరకంగా వారికి మేలు చేస్తుందన్నారు. 
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్)అభ్యసన సామర్థ్యం ఉండాలన్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, హెచ్చింపులు అనే నాలుగు రకాల కనీస అభ్యసనం వచ్చి ఉండాలన్నారు. 
కొంతమంది విద్యార్థులు ఆ విధంగా కనీస అభ్యసనం సామర్ధ్యం లేకపోవడం గుర్తించి వారికి సరైన పద్ధతిలో చదువు నేర్పించే విధంగా 1600 మంది నిర్మాణ్ వాలంటీర్లను పి..4 కింద గుర్తించి అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులను వ్యక్తిగత శ్రద్ధతో తీసుకుని అభ్యాసనం చేయిస్తే వాళ్లలో నమ్మకం పెరిగి వారి జీవితాలు బాగుపడతాయన్నారు.
 
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ
సమాజంలో పేదరికం నిర్మూలనకు పి….4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని అనాది నుండి పేదలను ఆదుకునే పరిస్థితి ఉందన్నారు. ఆనాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలు వెళ్లడానికి బరోడా మహారాజు ఆర్థిక సహాయం అందించారు. దీంతో అంబేద్కర్ ప్రముఖ న్యాయవాదిగా తయారై మన దేశానికి వచ్చారన్నారు.
 
గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ హిందూమతంలో ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, క్రైస్తవ మతంలో సంపాదనలో దశమ భాగం విరాళంగా అందించాలని, ముస్లింలలో రెండున్నర శాతం దానధర్మాలు చేయాలని ఉందన్నారు. 
జిల్లాలో పి…4 కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ ను అభినందించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ తపనతో జిల్లా కలెక్టరు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్టీసీ చైర్మన్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ మార్గదర్శీలుగా కృషి చేస్తున్న మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రతినిధులు చింతయ్య, తులసీదాస్, వాసవ్య మహిళా మండలి గన్నవరం ప్రతినిధి బొల్లినేని కీర్తి, విద్యావేత్త కొమరగిరి చంద్రశేఖర్, కొల్లు ఫౌండేషన్ ప్రతినిధి సూరిబాబు, ఇమ్మడిబత్తుల దిలీప్ కుమార్, పెనుమోలు ప్రభాకర్, వేము కోటేశ్వరరావు మానస, వెంకట బసవ సత్యనారాయణ, సాగి కృష్ణంరాజు, చలసాని ప్రసాద్, తాతినేని విజయబాబు, చిన్నమ నాయుడులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *