పెదతుమ్మిడి పిహెచ్ సి ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
మచిలీపట్నం:
మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. పి. యుగంధర్ పెదతుమ్మిడి పిహెచ్ సి లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, ఆసుపత్రిలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు మరియు సేవలను సమీక్షించారు. సందర్శన సందర్భంగా ఈహెచ్ఆర్ అప్డేషన్, ల్యాబ్ సేవలు, ఫార్మసీ నిర్వహణ, ఎస్ డి సి క్యాలెండర్ అప్డేషన్, బర్త్ ప్లానింగ్ కార్యక్రమాలను పరిశీలించారు. ప్రతి పిహెచ్ సి లో నెలకు కనీసం 2–5 సాధారణ ప్రసవాలు నిర్వహించే విధంగా సరైన ప్రణాళికతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని ఉద్యోగుల హాజరు రికార్డులను పరిశీలించిన డి ఎం హెచ్ ఓ విధుల్లో మరియు హాజరులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. తనిఖీలో భాగంగా వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి, పిహెచ్ సి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు.
తనిఖీ సందర్భంగా గుర్తించిన లోపాలు
పిహెచ్ సి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత సరిగా లేకపోవడం
ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత తగిన విధంగా నిర్వహించకపోవడం
లేబర్ రూమ్ నిర్వహణ సరిగా లేకపోవడం
ఫార్మసీ రికార్డులు మరియు బిన్ కార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం
ప్రస్తుత నెలలో పిహెచ్ సి లో ప్రసవాలు నిర్వహించకపోవడం
గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి, ఆసుపత్రిలో పరిశుభ్రత, నిర్వహణ మరియు సేవల ప్రమాణాలను మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందిని డి ఎం హెచ్ ఓ ఆదేశించారు. అదనంగా చేపట్టిన మెరుగుదలలను సమీక్షించేందుకు 15 రోజులలోపు మళ్లీ తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు.

