MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం MPL హైస్కూల్‌లో DEO యు.వి. సుబ్బారావు తనిఖీ

  • September 18, 2026
  • 1 min read
మచిలీపట్నం MPL హైస్కూల్‌లో DEO యు.వి. సుబ్బారావు తనిఖీ

మచిలీపట్నం:

మచిలీపట్నం మండల పరిధిలోని దేశాయిపేట ఎంపీఎల్ (MPL) హైస్కూల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ పాఠశాల: యువ ఫర్ స్వచ్ఛత’ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో నేరుగా సంభాషించారు. వారి విషయ పరిజ్ఞానం, అభ్యసనా పురోగతిని అడిగి తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల నోట్‌బుక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన సాగిస్తూ, క్రమం తప్పకుండా నోట్‌బుక్ కరెక్షన్స్ నిర్వహించాలని, విద్యార్థుల తప్పులను గుర్తించి సరిదిద్దేలా తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

తదుపరి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, వంటగది పరిశుభ్రతను డీఈఓ పరిశీలించారు. ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చివరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

‘మిషన్ మార్చ్-2027’ లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి 100 శాతం హాజరు సాధించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. క్రమం తప్పకుండా బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

About Author

SSN