జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలు: మచిలీపట్నం జిఎంసిలో ఘనంగా ర్యాలీ, క్విజ్ పోటీలు
మచిలీపట్నం:
స్థానిక ఎస్పీవీ ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) మరియు ప్రభుత్వ బోధన ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ మరియు క్విజ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మాకాలజీ విభాగం పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించబడుతున్న ఈ వారోత్సవాలను “ఫార్మాకోవిజిలెన్స్‌తో ఔషధాల హేతుబద్ధ వినియోగం” అనే ప్రధాన అంశంతో చేపడుతున్నారు. ఔషధాలను కేవలం వైద్యుల సూచనల మేరకే హేతుబద్ధంగా వినియోగించుకోవడం, మందుల వల్ల కలిగే ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను (Adverse Drug Reactions – ADRs) ముందస్తుగా గుర్తించి నివేదించేలా ప్రజలు, వైద్య సిబ్బంది మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. రేణుకాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డా. నవీన్ చౌదరి, బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లీలా ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్, డా. విజయలక్ష్మి, డా. నివేదిత, డా. నాగలక్ష్మిలతో పాటు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫార్మాకాలజీ విభాగం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

