కృష్ణాజిల్లా మత్స్యకారులకు 36.31 కోట్ల వేట నిషేధ భృతి
మచిలీపట్నం:
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, చేపల వేట నిషేధ కాలంలో 1,30,000 మంది మత్యకారులకు 286 కోట్ల రూపాయలు వేట నిషేధ భృతిని మంజూరు చేసి ఆదుకుంటూ ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి నగరంలోని కలెక్టరేట్ వి.సీ. హాలులో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, డిసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, తదితరులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు చెందిన 18,157 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 36 కోట్ల 31 లక్షల 40 వేల రూపాయల మెగా చెక్కును మంత్రివర్యులు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారులను ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు. ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా. గత సంవత్సరమే మత్స్యకార సేవలో పథకాన్ని చేపట్టి మత్స్యకారులు వేట నిషేధ కాలంలో ఇబ్బంది పడకూడదని 20 వేల రూపాయలు చొప్పున వేట నిషేధ భృతిని ఇచ్చిన ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇదివరకు తన మామగారైన నడుకుదిటి నరసింహారావు ప్రత్యేక కృషితో వేట నిషేధ కాలంలో బియ్యము, ఆయిల్ సబ్సిడీకి ఇచ్చే ఏర్పాటు చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సులభంగా చేపలు పట్టే విధంగా అవసరమైన పరికరాలు కూడా అందించడం జరిగిందన్నారు.
తర్వాత 2014 లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కష్టాలను గుర్తించి వారికి తొలిసారిగా 4000 రూపాయల వేట నిషేధ భృతిని అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వం చెరువులన్నీ కొట్టేయడానికి తెచ్చిన జీవో నంబర్ 217 ను తాము వ్యతిరేకించి పోరాటం చేశామని, తమ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి అందరికీ మేలు చేసిందన్నారు. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు గాని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు గాని తెలియజేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమం ఉందనీ, కోటి 20 లక్షల రూపాయలతో డీప్ సీ బోట్లు నిర్మాణం చేయడానికి ఇచ్చారన్నారు. మన ప్రాంతంలో ఒక్క బోటు కూడా తయారు కాలేదని, అందుకనే మన ముఖ్యమంత్రికి చెప్పానని ఎందుకంటే 40% సబ్సిడీ ఉందనీ, ఎస్సీ సోదరులకి మహిళలకి 60%. సబ్సిడీ ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి చెప్పగా అదనంగా 20 శాతం సబ్సిడీకి ఒప్పుకోవడం జరిగిందన్నారు. మిగిలిన మొత్తానికి కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ వద్ద 6 ఎకరాల స్థలం పడవల నిర్మాణానికి ఇంజనీర్ల ద్వారా సాంకేతికతపై మత్యకారులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదే కాకుండా ఇవాళ సముద్ర నాచు పండించేందుకు కూడా చాలా అవకాశం ఉందనీ, డ్వాక్రా మహిళలు ముందుకు వస్తే వారికి శిక్షణ ఇస్తామని, దాంతో మంచి ఆదాయము లభిస్తుందన్నారు. దాని మీద కూడా పరిశోధన సింగరాయ కొండలో జరుగుతూ ఉందన్నారు.. ఒకసారి నేను వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పి కలెక్టర్ తో ఒక సమావేశం పెట్టమని చెప్తున్నామన్నారు. మచిలీపట్నంలో పీతల హేచరీకి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని అందులో తొలి విడతగా 75 లక్షల రూపాయలు విడుదలచేయడం జరిగిందన్నారు. . త్వరలోనే మత్స్యకారులందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తామన్నారు. అలాగే తీర ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మన వాళ్ళు బలపడతారో ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.
పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకార సోదరులందరికీ కూడా అండగా నిలవాలనే లక్ష్యం తోటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరానికి వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని 286 కోట్ల రూపాయలు అందరి బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు. గతంలో చంద్రన్న భీమా ఉండటం వల్ల మత్స్యకారులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం రాగానే ఆ చంద్రన్న భీమా రద్దు చేయడం వల్ల కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ , మన ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపించుకు వెళ్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మల్లేశ్వరం ఏఎంసీ చైర్మన్ వడుగు తులసిరావు , వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, పలువురు మత్స్యశాఖ అధికారులు సిబ్బంది మత్స్యకారులు పాల్గొన్నారు.

