కృష్ణా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ‘బుక్ డొనేషన్ డ్రైవ్’ కార్యక్రమం
రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా గ్రంథాలయ సేవలు ఆదర్శం: జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో, హరిత ఫౌండేషన్ సహకారంతో బుధవారం ‘బుక్ డొనేషన్ డ్రైవ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు వివిధ శాఖా గ్రంథాలయాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాందేపని వర్జె హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రంథాలయాలతో పోల్చితే, కృష్ణా జిల్లా గ్రంథాలయాల పనితీరు అత్యుత్తమంగా ఉందని కొనియాడారు. చైర్మన్, కార్యదర్శి సిబ్బంది అంకితభావంతో పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ, సుమారు రూ. 20 లక్షల విలువైన పుస్తకాలను అందించిన హరిత ఫౌండేషన్, ఎమెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠకులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాందేపని వర్జె మాట్లాడుతూ, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడంతో పాటు, ఉద్యోగ జీవితంలో నైతిక విలువలను పాటించాలని సూచించారు. తాము ఎదిగి సమాజానికి తిరిగి సేవ చేసే స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీ. రవికుమార్ మాట్లాడుతూ, గ్రంథాలయాల అభివృద్ధికి పాఠకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే, డిప్యూటీ లైబ్రేరియన్ బీరెం వెంకటరమణ మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ విజయవంతమైందని, దాతలు అందించిన పుస్తకాలను త్వరలోనే శాఖా గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జి. రాధికా రాణి, యు. యోగేశ్వరరావు, బి. రమేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, రిఫరెన్స్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

