కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణకు జిల్లా యంత్రాంగం ఘన సన్మానం
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ తెలుగు రంగస్థల కళాకారుడు, పద్యనాటక గాన గంధర్వుడు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రకటించడం పట్ల జిల్లా కలెక్టర్ డీకే బాలాజి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందిన గుమ్మడి గోపాలకృష్ణ 1955లో జన్మించారు. ప్రముఖ నాటకకర్త ఆచంట వెంకటరత్నం ప్రోత్సాహంతో 1982లో నాటక రంగంలో ప్రవేశించి, తన అపూర్వ ప్రతిభతో తెలుగు రంగస్థల కళారంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ డిజిటల్ సాంకేతికతను వినియోగించి నాటక రంగాన్ని యువతరానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్‌ఏసీ) ఎస్. పోతురాజు, పమిడిముక్కల తహశీల్దారు గుమ్మడి గోపాలకృష్ణను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. తెలుగు నాటక రంగానికి గుమ్మడి గోపాలకృష్ణ అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడం జిల్లాకు గర్వకారణమని ఈ సందర్భంగా జిల్లా అధికారులు పేర్కొన్నారు.

