కొత్తపేట సొసైటీలో ₹41.73 కోట్ల అవినీతిపై నివేదిక కోరిన లోకాయుక్త
అవనిగడ్డ / ఉయ్యూరు:
కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం, కొత్తపేట గ్రామంలోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) లో జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై రాష్ట్ర లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. సొసైటీ సి.ఇ.ఓ నకిలీ రశీదులు, ఫోర్జరీ సంతకాలతో రూ. 41.73 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ તથા కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ను లోకాయుక్త ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ ఈ ఏడాది జులై 1 (01.07.2026)న కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన ₹41.73 కోట్ల అవినీతిపై రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావు (కేసు నెం. 1997/2026/బి1) విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
క్రిమినల్ కేసులు, రికవరీకి డిమాండ్
అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దుర్వినియోగమైన ప్రజల నిధులను ‘రెవెన్యూ రికవరీ చట్టం -1864’ ప్రకారం తిరిగి రాబట్టాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ లోకాయుక్తను కోరారు.

