జనసేనలో 12 ఏళ్లుగా పనిచేసినా దక్కని గుర్తింపు.. వర్గపోరుతో విసిగి కాంగ్రెస్లో చేరిన 30 మంది నాయకులు
* వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న మచిలీపట్నం నేతలు
* రాష్ట్ర ఓబీసీ కాంగ్రెస్ చైర్మన్ శొంఠి నాగరాజు నాయకత్వంలో భారీ చేరికలు
విజయవాడ:
జనసేన పార్టీలో దాదాపు 12 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినప్పటికీ సరైన గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత లభించకపోవడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వర్గపోరు కారణంగా విసిగిపోయిన మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన సుమారు 30 మంది జనసేన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి చేతుల మీదుగా, రాష్ట్ర ఓబీసీ కాంగ్రెస్ చైర్మన్ శొంఠి నాగరాజు నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడు శ్రీరామూర్తి ఆధ్వర్యంలో మచిలీపట్నం జనసేన నాయకుడు షేక్ చిన్న భాజీ తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
తమ కష్టానికి విలువ లేకుండా పోయింది: చేరిన నాయకులు
ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ.. “జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో ఏళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసినప్పటికీ తమకు తగిన గుర్తింపు, గౌరవం, రాజకీయ అవకాశాలు దక్కలేదు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీలో తీవ్రమైన అంతర్గత వర్గపోరు నెలకొంది. దీనివల్ల తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో, ప్రజాస్వామ్య విలువలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.
చేరిన వారికి తగిన గౌరవం: శొంఠి నాగరాజు
రాష్ట్ర ఓబీసీ కాంగ్రెస్ చైర్మన్ శొంఠి నాగరాజు మాట్లాడుతూ.. జనసేనలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులు కాంగ్రెస్ సిద్ధాంతాలు, వైఎస్ షర్మిలా రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేస్తుంది. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి తగిన గౌరవం, బాధ్యతలు కల్పిస్తూ వారి రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు నిర్వహిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్లో చేరిన ప్రముఖులు:
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో షేక్ చిన్న బాజీ, మొహమ్మద్ అహ్మద్, మహమ్మద్ బాజీ, అబ్దుల్ ఖాజా, షేక్ బాజీ హోలీ, మహమ్మద్ తాజుద్దీన్, నాడ మాధవరావు, పుప్పాల సాయిబాబు, బుర్ర చెన్నకేశవ, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ హమీద్, షేక్ గౌస్, షేక్ కన్నా, అన్నిశెట్టి లక్ష్మణరావు, మహమ్మద్ దిలావర్ ఖాన్, అబ్దుల్ సలాం, పుల్లేటి సాయిబాబు, బి.ఆర్. రత్నాజీ, పఠాన్ హుస్సేన్ ఖాన్, చందోలు గోపికుమార్, పెద్ద సింగ్ బర్నీ బాస్, లంకలపల్లి మురళీకృష్ణ, నంగనం శ్రీనివాసరావు, బలగం వెంకటేశ్వరరావు, పొట్లూరి బాలారెడ్డి, బ్రహ్మం, సికినం దానేలు, అబ్దుల్ గఫూర్ తదితరులు ఉన్నారు.
కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుండి మరిన్ని భారీ చేరికలు ఉండబోతున్నాయని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

