ప్రధాన జిల్లా న్యాయమూర్తిగా తప్పుడు గుర్తింపుతో సైబర్ మోసానికి యత్నం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా న్యాయవ్యవస్థలో గౌరవనీయులైన ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి, కృష్ణా, మచిలీపట్నం వారి పేరుతో తప్పుడు గుర్తింపును సృష్టించి సైబర్ మోసానికి పాల్పడేందుకు జరిగిన ప్రయత్నంపై జిల్లా న్యాయవ్యవస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఆగష్టు ఒకటవ తేదీన కొంతమంది న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బందికి గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి, గౌరవనీయులైన ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి వారి ఫోటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్‌గా ఉపయోగించి, తానే గౌరవనీయులైన న్యాయమూర్తినని తప్పుడు విధంగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం, సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేయాలని సందేశం ద్వారా కోరాడు.
ఈ విషయంపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, సైబర్ క్రైమ్ అధికారుల సమన్వయంతో దర్యాప్తు చేపట్టవలసిందిగా కోరుతూ మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయబడింది. ఏ న్యాయమూర్తి గానీ, న్యాయాధికారి గానీ వాట్సాప్ లేదా ఇతర అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా నగదు బదిలీ చేయాలని కోరరని జిల్లా న్యాయవ్యవస్థ ప్రజలకు స్పష్టం చేస్తోంది. కావున, ప్రజలు ఇటువంటి అనుమానాస్పద సందేశాలకు స్పందించకుండా, ఎటువంటి నగదును బదిలీ చేయకుండా, ఓటిపి లు, పిన్ లు, పాస్వర్డ్లు లేదా బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించకుండా* అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది.
ఇటువంటి అనుమానాస్పద సందేశాలు లేదా కమ్యూనికేషన్లు అందినట్లయితే, వాటిని వెంటనే పోలీసు లేదా సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.

