MachilipatnamLocal News
July 19, 2026
జిల్లా

జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి –– జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి కె. సునీత

  • July 10, 2026
  • 1 min read
[addtoany]
జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి –– జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి కె. సునీత

రాజీ ద్వారా కేసుల పరిష్కారంతో సమయం, డబ్బు ఆదా – మానవ సంబంధాల బలోపేతం

మచిలీపట్నం:

జాతీయ న్యాయసేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి. గోపి ఆదేశానుసారం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూలై 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొదటి అదనపు జిల్లా జడ్జి కె. సునీత, తెలిపారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మితో కలిసి జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి కె. సునీత మాట్లాడుతూ, ఈ ఏడాదిలో నిర్వహిస్తున్న రెండో జాతీయ లోక్ అదాలత్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో నిర్వహించబడుతుందని తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్ కేసులు, ట్రాఫిక్ చలానా కేసులు, అన్ని రకాల సివిల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, చల్లపల్లి, పమిడిముక్కల, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల ఆవరణలో మొత్తం 45 బెంచీలు ఏర్పాటు చేసినట్లు, వాటిలో మచిలీపట్నంలోనే ఐదు బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మార్చి 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,09,388 కేసులు పరిష్కారమయ్యాయని, ఈసారి అంతకంటే ఎక్కువ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, పరస్పర అవగాహన పెరిగి మానవ సంబంధాలు బలోపేతం అవుతాయని, అర్హత ఉన్న కేసుల్లో కోర్టు ఫీజు కూడా తిరిగి చెల్లించబడుతుందని పేర్కొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి మాట్లాడుతూ, లోక్ అదాలత్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించే సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక అని అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు, న్యాయవాదులు, బీమా సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తదితర శాఖల ప్రతినిధులతో పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, కుటుంబ వివాదాలు, ఇతర సివిల్ స్వభావం గల కేసులతో పాటు కోర్టులో దాఖలు కాకముందే రాజీ ద్వారా పరిష్కరించుకునే ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించే అవకాశం కల్పించినట్లు వివరించారు. రాజీ పడదగ్గ కేసులకు సంబంధించిన కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ‘సమాధాన్ సమరోహ్’ ప్రత్యేక లోక్ అదాలత్..

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ‘సమాధాన్ సమరోహ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు ఈ కార్యక్రమం ద్వారా అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ప్రీ-లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహించి, సంబంధిత కక్షిదారులను పిలిపించి రాజీ అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగ్గ కేసులకు సంబంధించిన కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో తమ వివాదాలను పరిష్కరించుకోవాలని ఎస్. వరలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

About Author

SSN