MachilipatnamLocal News
July 19, 2026
జిల్లా

ఏపీలో కోవిడ్ అప్రమత్తత.. అన్ని జిల్లాలకు అలర్ట్

  • July 14, 2026
  • 1 min read
[addtoany]
ఏపీలో కోవిడ్ అప్రమత్తత.. అన్ని జిల్లాలకు అలర్ట్

కడపలో కేసు నమోదుతో జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు

ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశం

మచిలీపట్నం:

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇటీవల కడప జిల్లాలో ఒక కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (ఐ డి ఎస్ పి) జూలై 10న అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.

ఐఎల్‌ఐ, ఎస్ ఏ ఆర్ ఐ కేసులపై ప్రత్యేక నిఘా

జిల్లాల్లో ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలు (ఐ ఎల్ ఐ), తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ (ఎస్ ఏ ఆర్ ఐ) కేసులను నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రతి కేసును ఐహెచ్‌ఐపీ (ఐ హెచ్ ఐ పి) పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఎక్కడైనా అసాధారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరిగినా లేదా ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదైనా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించింది.

ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు సిద్ధం

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ఆక్సిజన్, అవసరమైన మందులు తగిన నిల్వలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఐసోలేషన్ వార్డులు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

జీనోమిక్ సర్వైలెన్స్‌కు ప్రాధాన్యం

అవసరమైతే కోవిడ్ పాజిటివ్ నమూనాలను జీనోమిక్ సర్వైలెన్స్ కోసం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైరస్‌లో కొత్త వేరియంట్లు ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని నిరంతరం పరిశీలించాలని, జిల్లా స్థాయిలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అంబులెన్స్ సేవలు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించింది.

రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని శుచి, శుభ్రత పాటించాలని భయపడాల్సిన అవసరం లేదని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో శ్వాసకోశ పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, అవసరమైన సందర్భాల్లో మాస్క్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. అసాధారణంగా కోవిడ్ కేసులు, క్లస్టర్లు, ఆస్పత్రి చేరికలు లేదా మరణాలు పెరిగితే వెంటనే రాష్ట్ర సర్వైలెన్స్ యూనిట్‌కు సమాచారం అందించాలని, అన్ని జిల్లాలు పూర్తి స్థాయి అప్రమత్తతతో ప్రజారోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

About Author

SSN