హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం:
మచిలీపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని హోంగార్డులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ హోంగార్డుల సంక్షేమం కొరకు పలు డిమాండ్లు చేశారు.
హోంగార్డులులకు ప్రస్తుతం రోజుకు కేవలం రూ.710 మాత్రమే చెల్లిస్తున్నారని, నెలకు సుమారు రూ.22 వేలే వేతనం అందుతోందని పేర్కొన్నారు. నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు ఉండగా, మిగిలిన రోజుల్లో నిరంతరం విధులు నిర్వహించాల్సి వస్తోందని అన్నారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లతో సమానంగా బందోబస్తు విధులు, గొడవలు, నేర ఘటనలు, హత్య కేసుల వద్ద కాపలా వంటి అత్యంత ప్రమాదకర బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, హోమ్‌గార్డులకు తగిన వేతనం, ఆరోగ్య భద్రత, సంక్షేమ సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో ఇనుగుదురు పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, కొందరు పోలీసులపై దాడి చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది, హోమ్‌గార్డుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోమ్‌గార్డుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని, మరణించిన సహచరుల కుటుంబాలకు హోమ్‌గార్డులే విరాళాలు సేకరించే పరిస్థితి ఉండకూడదని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ ప్రయోజనాలు ప్రస్తుతం నిలిచిపోయాయని ఆరోపించిన ఆయన, ఎన్నికల సమయంలో హోంగార్డుల వేతనాల పెంపుపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తెలంగాణలో హోంగార్డులకు సుమారు రూ.30 వేల వరకు వేతనం అందుతోందని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
హోంగార్డుల కుటుంబాల్లో అర్హులైన వారికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని, హోమ్‌గార్డులను కానిస్టేబుళ్లతో సమానంగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. అలాగే ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు, ఇతర భత్యాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

