తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి OTP మినహాయింపు: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు
మచిలీపట్నం:
‘అర్నాద్’ తుపాను నేపధ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఓ.టీ.పీ. ఆధారిత ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివ రామ ప్రసాద్ తెలిపారు.
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, మొబైల్ నెట్‌వర్క్‌లు మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీలో అంతరాయాలు తలెత్తడంతో కేంద్ర పెట్రోలియం మరియు వాయువుల మంత్రిత్వ శాఖ ఈ వెసులుబాటుకు ఆమోదం తెలిపింది.
క్యాష్ అండ్ క్యారీ విధానానికి అనుమతి
వినియోగదారులు నగదు చెల్లింపు ద్వారా నేరుగా సిలిండర్లను పొందే ‘క్యాష్ అండ్ క్యారీ’ విధానాన్ని అమలు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ మినహాయింపులు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
ఎల్పీజీ గ్యాస్ డీలర్లు సరఫరాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమ నిల్వలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన సిలిండర్లను నిరంతరాయంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వినియోగదారులు ఈ వెసులుబాటును అవసరమైన మేరకే ఉపయోగించుకుని సహకరించాలని అధికారులు కోరారు.

