డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల ద్వారా దరఖాస్తులు
మచిలీపట్నం:
డప్పు కళాకారులు, చర్మకారులకు మంజూరు చేసే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు తెలిపారు. అర్హులైన వారు స్వీయ ధృవీకరణతో తమ సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ నమోదు చేసి, పింఛన్ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పిస్తారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తారని పేర్కొన్నారు.
ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులను సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (రూరల్), వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (అర్బన్) పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి, అర్హత నిర్ధారణకు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారని వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన దరఖాస్తులను తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు పంపిస్తారని షాహిద్ బాబు తెలిపారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు వచ్చి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, తమకు సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయాన్ని సంప్రదించి స్వీయ ధృవీకరణతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, పరిశీలన, క్షేత్రస్థాయి ధృవీకరణ తదితర ప్రక్రియలను సంబంధిత అధికారులు నిర్దేశిత విధానం ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైతే గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయంలోని వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాలని ఆయన కోరారు.

