MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • November 9, 2026
  • 1 min read
ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

గన్నవరం మండలంలోని ‘కేర్ అండ్ షేర్ డాడీస్ హోమ్’లో సంరక్షణ పొందుతున్న ఇద్దరు చిన్నారులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో దత్తత తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్, కేరళ రాష్ట్రాలకు చెందిన దంపతులు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ చిన్నారులను దత్తత తీసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దత్తత దంపతులతో ముచ్చటించి, చిన్నారులకు ప్రేమాభిమానాలు అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. సదరు దంపతులు 2021లో కేరింగ్స్ (CARINGS) పోర్టల్ ద్వారా నమోదు చేసుకోగా, నియమనిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత కలెక్టర్ చేతుల మీదుగా పాపాయిలను అప్పగించారు.

అనంతరం నవంబర్ మాసంలో నిర్వహించే ‘జాతీయ దత్తత మాసోత్సవాల’ ప్రత్యేక పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అర్హులైన దంపతులు కేవలం చట్టబద్ధమైన కేరింగ్స్ పోర్టల్ ద్వారానే దత్తత ప్రక్రియను చేపట్టాలని, ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. విమల, బాలల సంరక్షణ అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN