బి.పి. మండల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: బీసీ సంక్షేమ సంఘం
మచిలీపట్నం:
వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ బిందేశ్వరి ప్రసాద్ (బి.పి.) మండల్ అని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం కొనియాడారు. బి.పి. మండల్ 108వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఈడేపల్లిలోని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శేకుబోయిన సుబ్రమణ్యం మాట్లాడుతూ.. బి.పి. మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించి, బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన దేశమంతటా పర్యటించి వెనుకబడిన వర్గాల స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో బీసీలకు సమాన భాగస్వామ్యం లభించాలని మండల్ గళమెత్తారని గుర్తుచేశారు.
1979లో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షుడిగా నియమితులైన బి.పి. మండల్.. బీసీల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి అవసరమైన సమగ్ర సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఆయన చేసిన సిఫార్సులలో కొన్నింటిని 1990లో అప్పటి వి.పి. సింగ్ ప్రభుత్వం అమలు చేసిందని, దీని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని అభివర్ణించారు. సమాజంలో ద్వేషం కాకుండా ఐక్యత, సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం పెంపొందించాలని బి.పి. మండల్ చూపిన మార్గంలో ప్రతి ఒక్క బీసీ నడవాలని, వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జన్ను గోవిందు, కోమటి శ్రీను, భోగిరెడ్డి సుభాని, బి. నాంచారయ్య, పి. సాంబశివ, ఎం. రామారావు, బి. నాగరాజు, గంగుల నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

