ఆకతాయి బాలుడి ఆగడం
మచిలీపట్నం:
మచిలీపట్నంలో గత రెండు రోజులుగా సంచలనం సృష్టించిన 9వ తరగతి బాలుడి కిడ్నాప్ ఉదంతం కేవలం ఒక అపోహ అని పోలీసులు తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఆ బాలుడు స్వచ్ఛందంగానే వెళ్ళాడని విచారణలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే మే 1వ తేదీన హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బాలుడు ట్యూషన్‌కు వెళ్తూ మాయమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారనే వార్త దావాగ్నిలా వ్యాపించడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడికి చదువుపై ఆసక్తి లేక, ఆ విషయం ఇంట్లో చెప్పలేక భయంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన సైకిల్‌ను బస్టాండ్‌లో ఉంచి, బస్సులో పెడన వెళ్లి, అక్కడి నుండి రైలులో విజయవాడకు చేరుకున్నాడు. విజయవాడలో ఏం చేయాలో తెలియక తచ్చాడుతూ, చివరకు ఒక బాటసారి ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేయడంతో బంధువులు వెళ్లి బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. కిడ్నాప్ వార్తలు కేవలం పుకార్లేనని చిలకలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

