మచిలీపట్నం సేవ్ హాస్పటల్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
ఆధునిక వైద్య సాంకేతికతతో కర్ణభేరి, చెవి ఎముకలు నిర్మాణం పునరుద్ధరణ
మచిలీపట్నం:
కళ్లుతిరుగుతున్నాయని వైద్యులను సంప్రదించిన 60 ఏళ్ల వ్యక్తిలో అరుదైన, తీవ్రమైన చెవి వ్యాధిని గుర్తించి సేవ్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు సేవ్ హాస్పటల్ డాక్టర్ వేము సందీప్ తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుమారు మూడు గంటలపాటు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.
నగరానికి చెందిన వ్యక్తి కొంతకాలంగా చెవిలో ఎముకలు ఇన్ఫెక్షన్ పాటు తరచూ కళ్లుతిరుగుతున్నట్లు గుర్తించి సేవ్ ఆసుపత్రిలోని చెవి, ముక్కు, గొంతు వైద్యులు వేము సందీప్ ను సంప్రదించారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయగా, చెవిలో కొలెస్ట్రీటోమ అనే తీవ్రమైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. ముఖ నాడికి సంబంధించిన సమస్య, చెవిలోని చిన్న ఎముకలు దెబ్బతినడం, సమతుల్యతకు సంబంధించిన అర్ధవృత్తాకార నాళంలో సమస్య… తదితర ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధితో క్రమంగా బ్రెయిన్ దెబ్బతింటుందని ముఖానికి పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ వేము సందీప్ ఆధ్వర్యంలోని వైద్య బృందం చెవిలోని దెబ్బతిన్న నిర్మాణాలను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పునర్నిర్మాణ శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను సుమారు మూడు గంటల్లో విజయవంతంగా పూర్తి చేయగలిగామని చెప్పారు. సకాలంలో చికిత్స అందించకపోతే వినికిడి మరింత దెబ్బతినడంతో చెవిలో దీర్ఘకాలిక సమస్యలు, సమతుల్యతకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండేదని వివరించారు.
అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ద్వారా సేవ్ ఆసుపత్రి వైద్య బృందం అరుదైన ఘనత సాధించినట్లు డాక్టర్ సందీప్ తెలిపారు. రోగి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.

