కృష్ణా జిల్లాలో రూ.60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా పోలీసులకు మరోసారి విశేష విజయం లభించింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న, చోరీకి గురైన సుమారు రూ.60 లక్షలు విలువ గల మొత్తం 400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రికవరీ చేయబడిన ఫోన్లను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక బృందాలు, సైబర్ సెల్, సీసీఎస్ సిబ్బంది సమన్వయంతో విచారణ చేపట్టి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఫోన్లు పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం వల్ల వాటి IMEI నంబర్ల ఆధారంగా దేశవ్యాప్తంగా ట్రాక్ చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యమైందని తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లలో మచిలీపట్నం సీసీఎస్ – 100, పెనమలూరు సీసీఎస్ – 63, గుడివాడ సీసీఎస్ – 237 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిని త్వరలో బాధితులకు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు గుర్తించి తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని, ప్రజల ఆస్తుల రక్షణకు కృష్ణా జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

