MachilipatnamLocal News
June 27, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం బీచ్‌లో 63 అడుగుల మట్టి గణపతి

  • June 26, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నం బీచ్‌లో 63 అడుగుల మట్టి గణపతి

మచిలీపట్నం:

రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మచిలీపట్నం బీచ్‌లో మునుపెన్నడూ లేని విధంగా భారీ మట్టి గణపతి ప్రతిష్ఠాపనతో పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై గురువారం మచిలీపట్నంలోని మెహర్ బాబా ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా “మట్టి గణపతిని పూజిద్దాం – ప్రకృతిని కాపాడుకుందాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కాలనీలో మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం బీచ్‌లో 63 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు పర్యావరణ హిత సందేశాన్ని ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవంలో భాగస్వాములు కావాలని, మచిలీపట్నం వైపు రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లేలా ఉత్సవాలను నిర్వహించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఉత్సవాల నిర్వహణ, సమన్వయం, ప్రచార కార్యక్రమాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా శుభ ముహూర్తంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి పవిత్ర మట్టిని సేకరించి, ప్రజల సమక్షంలో గణపతి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది ప్రజల భాగస్వామ్యంతో జరిగే సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో బందరు పోర్టు నిర్మాణం పూర్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, మచిలీపట్నం బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ ఈ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, ప్రజల ఐక్యత అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో నిర్వహించే ఈ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు, ప్రజలు తరలివచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ బందరు వచ్చి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About Author

SSN