MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

  • June 22, 2026
  • 0 min read
ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఉన్న ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గొర్రిపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, మోటమర్రి బాబా ప్రసాద్ తదితర కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, నగరానికి మరింత శోభ తీసుకువచ్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

అమృత్ స్కీమ్ కింద రూ.2.78 కోట్ల వ్యయంతో ధర్మాన చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఈ అభివృద్ధి పనులను మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టనుందని అన్నారు. ధర్మాన చెరువు అభివృద్ధి పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం మచిలీపట్నం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి అన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యలో డాల్ఫిన్ మౌంటైన్ వంటి ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని “బందరు ఐకాన్”గా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సేద తీరేలా అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

About Author

SSN