మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత : మంత్రి కొల్లు రవీంద్ర
డ్రైనేజీ పనుల పూర్తికి ముఖ్యమంత్రి రూ.13 కోట్లు మంజూరు
మచిలీపట్నం:
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనుల్లో మిగిలిన గ్యాప్‌లను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి తక్షణమే రూ.13 కోట్ల నిధులు మంజూరు చేశారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సోమవారం ఉదయం మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకల్లు నారాయణరావు తో కలిసిఈడేపల్లి శక్తి గుడి దగ్గర 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మురుగునీటి వ్యవస్థ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం నిధుల సమీకరణలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు.
మచిలీపట్నం నగర అభివృద్ధి కోసం దాదాపు రూ.185 కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని, వాటిలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, రోడ్ల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
గతంలో నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తి చేసి, భవిష్యత్తులో వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. నగరంలోని మురుగు నీటి శుద్ధి కోసం ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సుందరయ్య నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ పనులను పూర్తి చేస్తామని, మరో రెండు ఎస్టీపీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసి మాత్రమే కాలువల్లోకి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను పరిష్కరించేందుకు నగరంలోని ప్రధాన డ్రైన్ల వద్ద పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా భారీ వర్షాలు, సముద్రపు పోటు సమయంలో కూడా నీటిని త్వరగా బయటకు పంపే అవకాశం ఉంటుందన్నారు.
నగరంలో పేరుకుపోయిన చెత్త కొండను తొలగించే చర్యలు చేపట్టామని, భవిష్యత్తులో చెత్తను వేరు చేసి వినియోగించేందుకు శాస్త్రీయ పద్ధతులు అమలు చేస్తున్నామని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ సమీపంలో 13 ఎకరాల స్థలంలో ఆధునిక వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
మచిలీపట్నం తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో రూ.16 కోట్లతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి, సామర్థ్యాన్ని పెంచామని మంత్రి తెలిపారు. రిజర్వాయర్ల సంఖ్యను కూడా పెంచి ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా కల్పిస్తున్నామని చెప్పారు.
నగరంలో రోడ్ల అభివృద్ధి పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నం నగరానికి ఏర్పడినప్పటి నుంచి ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ప్రస్తుతం నిర్మించిన ప్రధాన డ్రైనేజీ వ్యవస్థకు అవసరమైన కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందని, మొత్తం 117 ప్రాంతాల్లో ఉన్న గ్యాప్‌లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, ప్రజారోగ్య శాఖ ఈఈ ప్రదీప్, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక నాయకురాలు సుశీల తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

