జూన్ 7 నుండి 21 తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
జూన్ నెల 21వ తేదీ న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధన దిశగా ఈనెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమాలను చేపడుతున్నది.
గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్నీ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సహకారంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలో నెలరోజులపాటు ఎంతో విజయవంతంగా నిర్వహించారు. జిల్లా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ కృషితో ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లాలో 8,20,496 మంది ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 140 మంది మాస్టర్ ట్రైనర్లు, 5133 మంది ట్రైనర్లు కూడా యోగ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

జిల్లాలోని మొవ్వ మండలం ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో కూచిపూడి నృత్య భంగిమలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి ప్రశంసలందుకుంటూ రాష్ట్రస్థాయిలో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును ఆయన చేతుల మీదుగా స్వీకరించారు.

అలాగే గత సంవత్సరం జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రం తరఫున ముద్రించిన ఆహ్వాన పత్రికలో కృష్ణాజిల్లా మంగినపూడి బీచ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమాలను ప్రముఖంగా ప్రచురించడం చెప్పుకోదగ్గ విశేషం.

అంతేకాకుండా నాగాయలంకలో జల యోగ ఆసనాలు నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన క్యాలెండర్లో స్థానం సంపాదించడం జిల్లాకే గర్వకారణం. ఈ జల యోగ చారిత్రాత్మక సంఘటనగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదయింది.

ఇవేకాక గత ఏడాది యోగా కార్యక్రమాలు ప్రముఖంగా గుడివాడ, బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలలో కూడా జరిగాయి. జూన్ 21న ఉయ్యూరులో జిల్లాస్థాయి యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు ప్రత్యేకంగా యోగా శిక్షణ తరగతులను నిర్వహించి తాను స్వయంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం జిల్లాలో ఈనెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు పలు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ఈనెల 7 వ తేదీన మంగినపూడి బీచ్ లో, 16 సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి పర్యాటక ప్రాంతాల్లో ఒక్కోచోట 500 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది.
అలాగే ఈనెల 10వ తేదీన గుడివాడ కానీ మరొకచోట గాని ఎంపిక చేసిన ప్రదేశంలో ఆటో, లారీ సంఘాల ప్రతినిధులు 500 మందితో పెద్ద ఎత్తున థీమాటిక్ యోగ (యోగా ఇతివృత్తంతో) నిర్వహించడం జరుగుతుంది. యోగాంధ్ర పై యువతీ యువకులకు, పెద్దలకు వయసుల వారీగా యోగా క్విజ్, నినాదాలు, వ్యాసరచన వంటి వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈనెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు గ్రామస్థాయిలో , 10 నుండి 13వ తేదీ వరకు మండల స్థాయిలో, 14 ,15, 16 తేదీలలో జిల్లా స్థాయిలో , 17 నుండి 20వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో యోగా పోటీలు జరగనున్నాయి. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎంపిక చేసిన ప్రదేశంలో జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని 1000 మందితో నిర్వహించనున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆ రోజున యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ, అన్ని మండలాలు మున్సిపాలిటీలలో తహసిల్దారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల విద్యాధికారులు, ఆయుష్ శాఖ వైద్యాధికారులు, పంచాయతీరాజ్ కార్యనిర్వహణ అధికారులు వారి పరిధిలో యోగా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. జిల్లాలోని అనువైన పాఠశాలలు, పార్కులు సమావేశ మందిరాలు, , స్టేడియం, ఆసుపత్రులలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యోగా కార్యక్రమాలలో పాల్గొనేందుకు యోగా గురువులు, నిపుణులు, స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంది.
అలాగే యోగ పై ఆసక్తి కలిగిన వారు, శిక్షణార్థులు, మాస్టర్ ట్రైనర్ల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలలో అధికార యంత్రాంగం తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. యోగా నిర్వహించే ప్రదేశాల వద్ద అవసరం మేరకు భూమి చదును, పరిశుభ్రం చేయడంతో పాటు మంచినీరు మరుగుదొడ్లు తదితర కనీస వసతులు ఏర్పాటు చేయనున్నారు. పంచాయితీ, మునిసిపల్, పోలీసు, విద్యా, సంక్షేమ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో యోగా కార్యక్రమాలను విజయవంతం చేయనున్నారు.

