MachilipatnamLocal News
June 3, 2026
స్పెషల్ స్టోరీ

బీసీ ల పింఛను హామీపై ఆచరణ ఎప్పుడు?

  • June 3, 2026
  • 1 min read
[addtoany]

తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ లకు మొండి చెయ్యేనా!
మేనిఫెస్టో హామీలు నీటి మీద రాతలేనా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వెనుకబడిన తరగతుల కుల(బిసి) జాబితాలో దాదాపు 138 కులాలు ఉన్నాయి. ఈ కులాలను వాటి సామాజిక, ఆర్థిక, వృత్తిపరమైన నేపథ్యాలను బట్టి ప్రభుత్వం 5 గ్రూపులు(ఏ,బి,సి,డి,ఇ)గా విభజించింది.

బీసీ కులాల వర్గీకరణ

బీసీ(ఏ) – అట్టడుగు, సంచార, విముక్త జాతుల వారు. ఇందులో దాదాపు 54 పైగా కులాలు ఉన్నాయి.
బీసీ(బి) – ఇందులో సంప్రదాయ వృత్తులపై ఆధారపడే దాదాపు 28 కులాలు ఉన్నాయి.
బీసీ (సి) -షెడ్యూల్డ్ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినవారు
బీసీ(డి) – ఇతర వెనుకబడిన తరగతుల వారు. ఇందులో దాదాపు 48 పైగా కులాలు ఉన్నాయి.
బీసీ(ఇ) – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలు

రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక-ఆర్థిక మరియు కులగణన నివేదికల ప్రకారం చూస్తే, ఏపీ జనాభాలో సగానికి పైగా బీసీ వర్గాల వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో బీసీల శాతం 50.59% గా ఉంది. అంటే రాష్ట్రంలో ప్రతి 100 మందిలో దాదాపు 51 మంది వెనుకబడిన తరగతులకు చెందినవారే. రాష్ట్ర మొత్తం జనాభా సుమారు 5.31 కోట్లుగా ఉంటే, అందులో బీసీల సంఖ్య 2.68 కోట్లు (2,68,23,000 పైగా) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం బీసీలే. ఆ తర్వాతి స్థానాల్లో ఓసీలు 23.53%, ఎస్సీలు 18.31%, ఎస్టీలు 5.86% ఉన్నారు.

జిల్లాల వారీగా ప్రాధాన్యత

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 19.29 లక్షల మంది బీసీలు ఉన్నారు. శాతం పరంగా చూసినా ఈ జిల్లాలోనే అత్యధికంగా 80.83% జనాభా బీసీలదే. ఆ తర్వాతి స్థానాల్లో విజయనగరం (76.55%), అనకాపల్లి (72.73%) జిల్లాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా కేవలం 22,878 మంది (3.26%) మాత్రమే బీసీ జనాభా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి మలిదశలో జరిగిన కుటుంబ సర్వేల వరకు అన్ని అధికారిక ప్రాథమిక నివేదికలు కూడా ఏపీలో బీసీ జనాభా 50 శాతం పైనే ఉందని స్పష్టం చేస్తున్నాయి.

మంత్రివర్గంలో

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్న మొత్తం 25 మంది మంత్రులలో (ముఖ్యమంత్రితో కలిపి) 8 మంది బీసీలు ఉండటంతో, మంత్రివర్గంలో బీసీల వాటా 32% గా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీ లు దాదాపు 51% ఉంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మాత్రం బీసీలు 32% గా ఉన్నారు. ఓసీ లు 13మంది మంత్రులు (జనాభా ప్రకారం 23 శాతం ఉంటే మంత్రివర్గంలో 52 శాతం), ఎస్ సి లు ఇద్దరు మంత్రులు (జనాభా ప్రకారం 18 శాతం ఉంటే మంత్రివర్గంలో 8 శాతం), ఎస్ టి లు ఒక్కరు (జనాభా ప్రకారం సుమారుగా 6శాతం ఉంటే మంత్రివర్గంలో 4శాతం), ముస్లిం మైనారిటీలు ఒక్కరు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం మొత్తం 8 మంది బీసీ మంత్రులు – కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎస్. సవిత ఉన్నారు. వివిధ ఉప-కులాలకు చెందిన (కొప్పుల వెలమ, మత్స్యకార, యాదవ, గౌడ, శెట్టిబలిజ, తూర్పుకాపు, కురబ)వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

మేనిఫెస్టో హామీ

2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీలు తమ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు నిండిన అర్హులైన బీసీలకు నాలుగు వేల రూపాయలు ఫించను ఇస్తామని వాగ్దానం చేసాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 51 శాతం ఉన్న బిసి జనాభా ఓటర్లు కూటమి నాయకత్వాన్ని ఆదరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. కానీ 2024 లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా నేటి వరకు ఆ దిశగా ఎటువంటి ఆలోచన చేయలేదు. 2026- 2027 బడ్జెట్ కేటాయింపులలో కూడా హామీ నెరవేర్చే దిశగా అడుగులు పడలేదు. ఏపీ క్యాబినెట్లో 32 శాతంగా బీసీ మంత్రులు ఉన్నప్పటికీ తమ వెనుకబడిన తరగతుల వర్గాల వారికి ఇచ్చిన ముఖ్యమైన మేనిఫెస్టో హామీ పై ఎటువంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ తమ పార్టీని బలంగా సమర్థిస్తూ వస్తున్న అలాంటి ముఖ్యమైన బిసి వర్గానికి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం శోచనీయం.

కులం అంటే ఒక వ్యక్తి కాదు ఒక సమూహం. ఒక వ్యక్తికి కార్పొరేషన్ పదవి లేక మంత్రి పదవి ఇచ్చి కులాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లుగా ప్రకటనలు గుప్పించడం వల్ల కులం వెనకబాటు తనాన్ని తగ్గించలేరు. కులాన్ని ఉద్ధరించడం అంటే ఆ సమూహానికి లబ్ధి చేకూర్చడం. అలా సమూహానికి లబ్ధి చేకూర్చే హామీని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి నాయకులు ఆచరణలో మాత్రం విస్మరించారు. బీసీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు కూడా బీసీలకు న్యాయం చేయడంలో ఎటువంటి ముద్ర వేయలేకపోతున్నారు.

సంపద సృష్టిస్తా

2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల హామీల అమలుకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించటం లేదు అని పదే పదే వల్లె వేస్తున్నారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మేనిఫెస్టోలోని హామీలను సంపద సృష్టించి నెరవేరుస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సమావేశాల్లో వాగ్దానం చేశారు. దాంతో అర్హత గల వెనకబడిన వర్గాల వారందరూ కూటమి ప్రభుత్వం తమకు ఖచ్చితంగా 50 సంవత్సరాలకు ఫించన్ ఇస్తుందని భావించారు. ఆచరణలో మాత్రం అది సాధ్యపడటం లేదు. నేడు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనకబడిన వర్గాల వారి కి ఇచ్చిన హామీని అమలుపరచడంలో ఏ విధమైన ఆలోచన, కార్యాచరణ లేకపోవడంతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలిచిన బీసీల పట్ల అలసత్వం వహిస్తే అది భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కూటమి మేనిఫెస్టో హామీలు “నీటి మీద రాతలు” అనే ముద్ర పడకుండా ఉండాలంటే, ప్రభుత్వం త్వరలోనే బీసీ పెన్షన్ హామీపై స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల కులాల వారు సమైక్యంగా కూటమి మేనిఫెస్టో హామీపై ఉద్యమిస్తే ప్రభుత్వానికి సంకట స్థితి తప్పదు.

శ్యామ్ కాగిత
మచిలీపట్నం

About Author

SSN