ఆపరేషన్ క్లీన్ స్వీప్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాలి.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
స్వచ్ఛంద లిట్టర్ పికింగ్ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు భాగస్వాములు కావాలి
మచిలీపట్నం:
జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంపై వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేసే సమయంలో కనీసం అరగంట సమయం కేటాయించి ఒక వీధిని ఎంపిక చేసుకుని అక్కడ కనిపించే కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర చెత్తను తొలగించే లిట్టర్ పికింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై పనిభారం కూడా కొంత మేర తగ్గుతుందన్నారు. స్థానికంగా నివసించే వారే పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు చూసినప్పుడు ఇతరులు కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడానికి వెనుకాడతారని పేర్కొన్నారు.
జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ కోరారు. మచిలీపట్నంలో నివసిస్తున్న జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తాను కూడా వీలైనప్పుడల్లా లిట్టర్ పికింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. జిల్లాను స్వచ్ఛమైన, పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమ సమన్వయకర్త, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, అధికారుల భాగస్వామ్యం, ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో అధికారులకు వివరించారు.

