MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. కలెక్టర్ ఎదుటే పురుగుల మందుతో మహిళ ఆత్మహత్యాయత్నం

  • May 18, 2026
  • 0 min read
కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. కలెక్టర్ ఎదుటే పురుగుల మందుతో మహిళ ఆత్మహత్యాయత్నం

మచిలీపట్నం:

కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన అక్క మృతి కేసులో న్యాయం జరగలేదని ఆరోపిస్తూ అద్దంకి సంద్యారాణి (30) కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగేందుకు యత్నించడం కలకలం రేపింది. సమావేశ మందిరంలో అర్జీ సమర్పిస్తున్న సమయంలోనే సంద్యారాణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను బయటకు తీసి తాగేందుకు ప్రయత్నించగా, అక్కడే అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి ఆమె చేతిలోని డబ్బాను లాక్కొని బయటకు తీసుకువచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తన అక్క సుదగాని సుదారాణి మృతి వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని, అయితే ఆ ఘటనను ఆత్మహత్యగా చూపిస్తూ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని సంద్యారాణి ఆరోపించారు. కొంతమంది పెద్దమనుషులు డబ్బులు తీసుకుని నిజాలను దాచిపెడుతున్నారని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు, పోలీసులకు అర్జీలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, వారికి న్యాయం జరగాలంటే కేసుపై మళ్లీ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంద్యారాణిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో “మీకోసం” కార్యక్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

About Author

SSN